భగవంతుడు వివిధ కాలాలలో వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు విగ్రహ రూపంలో సాక్షాత్కరించిన ఉదాంతం ఇది. మచిలీపట్నం చిలకలపూడి అనగానే రోల్డ్ గోల్డ్ నగలకు ప్రతీతి. కానీ ఆ నగలకే అందాన్నిచ్చే శ్రీ మహా విష్ణువు పాండురంగనిగా ప్రత్యక్షమైన సంఘటన చిలకలపూడి లో జరిగింది.
పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించిన కీర పండరీపురం జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలోని చిలకలపూడి లో ఉంది. ఈ క్షేత్రానికి కీర పండరీపురం అని పేరు కూడా ఉంది. పూర్వం చిలకలపూడిలో దోస వ్రతం చేసేవారట అంటే దోస విత్తనాలు నాటి ఆ విత్తనాలు పెరిగి కాయలు కాసిన తర్వాత భగవంతునికి సమర్పించే వారట. అందుకే చిలకలపూడికి కీర పండరిపురం అని పేరు వచ్చి ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.
ఈ క్షేత్ర నిర్మాణానికి కారకులైన భక్త నరసింహం కాకి బంగారంతో నగలు చేయడం జరిగింది. అందుకే చిలకలపూడి నగలు అని పేరు కూడా వచ్చి ఉంటుంది.1889 ఏప్రిల్ 4 తేదీ విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరవెల్లి గ్రామంలో విశ్వ కర్మ కులస్తులైన గంగాధరం, రామన్న దంపతులకు జన్మించారు. నరసింహం, ఆయన చిన్నతనం నుండే దైవచింతనలో ఉండేవారు. తన 18వ సంవత్సరంలో చిలకలపూడి బంగారం పేరుతో వ్యాపారం చేసేవారు.
నరసింహం ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గుండా మహారాజు అనే గురువు దర్శనం అయ్యింది. నరసింహం కి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసిమాల ప్రసాదించారు. కొంత కాలం తర్వాత గురువుగారే మహామంత్ర రాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహం అని పేరు పెట్టారు. గురువు ఆశీర్వాద బలంతో భక్త నరసింహం ఆలయ నిర్మాణం తలపెట్టారు.
శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రబాగా నదిలోని కొన్ని గులకరాళ్ళను ఉపయోగించ సంకల్పించారు. నది మహా ఉధృతంగా ఉన్నందున గులకరాళ్ళను సేకరించడం సాధ్యపడలేదు. అప్పుడు నరసింహం చంద్రబాగా నదిని ప్రార్థించగా పండరికా దేవాలయం పక్కన ఒక ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహం పడవలో నదిలోని ఇసుక, రాళ్లు సేకరించారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండ్రటి రాయి దొరికింది. వాటిని అన్నింటిని పాండురంగడి ముందు ఉంచి నరసింహం గుండా మహారాజులు తన్మయత్వంలో ప్రార్థనలో ఉండగా పాండురంగడి నుంచి ఒక దివ్యమైన జ్యోతి అక్కడున్న గుండ్రటి రాయిలో ప్రవేశించింది. ఆరోజు రాత్రి పాండురంగడు నరసింహం కలలో సాక్షాత్కరించి కీర పండరీపురం క్షేత్రంలో శ్రీ శుక్లా నామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం 13 నవంబర్ 1929 పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని చెప్పారు. దాంతో నరసింహం పండరిపురం నుండి చిలకలపూడి కి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
రోజులు గడుస్తుండగా నరసింహం గురువుగారైన మహీపతి మహారాజ్ కు పాండురంగడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ శిష్యుని కోసం తాను తెలిపిన 13 నవంబర్ 1929 కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని చెప్పారు. ఈ విషయం మహారాజ్ ఒక లేఖ ద్వారా నరసింహం కు తెలియజేశారు. అప్పటికే పాండురంగని విగ్రహం తప్ప ఆలయం నిర్మాణం పూర్తయింది. పాండురంగడు సాక్షాత్కరిస్తానన్న రోజు రానే వచ్చింది.
వేలాదిమంది భక్తులు, పెద్దలు, అధికారులు పాండురంగని గుడికి చేరుకున్నారు. మహా అద్భుతమైన పాండురంగడిని దర్శించుకోవాలంటే గుడిలో విగ్రహం లేదు. ఎలా ఆ భగవంతుని సాక్షాత్కారం జరుగుతోంది అని అందరిలో ఆందోళన. గర్భగుడి కి తాళం వేసి సీలు వేశారు. క్షణాలు గడుస్తున్నాయి. నరసింహం పాండురంగని ప్రార్థనలో ఉన్నారు. పగలు 10:30 అయ్యింది.
భక్త నరసింహంతో కలిసి అక్కడికి వచ్చిన భక్తులంతా తన్మయత్వంలో ప్రార్థనలు చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దివ్య తేజస్సు మధ్య పాండురంగని విగ్రహం సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున పండరీపురంలోని పాండురంగని విగ్రహం లాగానే ఉంది భక్తులకు దర్శనమిచ్చిన విగ్రహం. అప్పటి నుంచే పాండురంగని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పండరీపురం లోని పాండురంగని పాదాలు ఎలా తాకుతారో అలానే ఇక్కడ కూడా పాదాలను భక్తి భావంతో తాకవచ్చు.
అనంతరం భక్త నరసింహం సహస్ర కోటి విఠల నామ యజ్ఞం తలపెట్టగా దేశంలోని అనేక మంది యజ్ఞంలో పాల్గొని శ్రీ విఠల నామం రాశారు. అలా రాసిన పుస్తకాలన్నీ పూజా విధానంతో ఆలయ ప్రాంగణంలో విఠల కోటి స్థూపం లో నిక్షింపబడ్డాయి. ప్రతి ఏటా పాండురంగని ఉత్సవాలు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భగవంతుడు భక్త దాసుడు అని నరసింహం ద్వారా నిరూపింపబడింది. నరసింహం 16 జనవరి 1974 లో పరమపదించారు. ఆ సమయంలో నరసింహం శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమయ్యింది. సహస్ర లింగ మండపం వద్ద గంటలు ఓంకార నాదాలతో మోగటం అద్భుతం... మహా అద్భుతం.
దేవాలయ నిర్మాణ సమయంలోనే భక్త నరసింహం ఆజ్ఞ ప్రకారం మహా మండపం నందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరిచి తన శరీరాన్ని అక్కడే ఉంచమన్నారు. ఆ విధంగానే నరసింహం నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించారు.
సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ పాండురంగని ఆలయానికి కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజాదికాలు నిర్వహిస్తారు. ఈ కార్తీకమాసంలో భక్తులు సముద్ర స్నానం ఆచరించి పాండురంగని ఉత్సవాల్లో పాల్గొని పాండురంగడిని దర్శించి పునీతులు అవుతారు.
భక్తులు మచిలీపట్నంలోని చిలకలపూడి చేరుకోవడానికి రైలు బస్సు మార్గాలు ఉన్నాయి విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు రెండు పూటలా పాండురంగని దర్శించుకోవచ్చు.





