MachilipatnamLocal News
December 6, 2025
సమగ్రం

ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • December 5, 2025
  • 1 min read
ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలా చేయూత అందిస్తుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
శుక్రవారం జిల్లా కలెక్టర్ అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి మండలాల్లో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు డిఆర్డిఏ –వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొంది ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల డ్వాక్రా యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
తొలుత ఎస్వీ డ్రై క్లీనింగ్ పేరుతో ఏర్పాటు చేసిన వాషింగ్ స్టెయిన్ రిమూవర్ స్టీమ్ ఐరన్ శారీ రోలింగ్ డ్వాక్రా యూనిట్ను పరిశీలించి అంజలి ఎస్ హెచ్ జి సభ్యురాలు గరికపాటి సువర్ణ తో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు
ఈ సందర్భంగా ఆమె వారి భర్త పెద్దన్న మాట్లాడుతూ తాము అవనిగడ్డతోపాటు బాపట్ల, రేపల్లెలో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. తమ యూనిట్ ఏర్పాటు చేసి రెండు నెలలు అయిందన్నారు. తమ యూనిట్లో 20 మందికి ఉద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు. తమకు ముద్రా కింద 5 లక్షల రూపాయలు, పీఎంఈజీపి కింద 10 లక్షల రూపాయలు మొత్తం 15 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి రుణ సహాయం పొందామన్నారు. తమకు నెలకు రెండు లక్షల రాబడి వస్తుందని అందులో ఈ యం. ఐ , వివిధ రకాల ఖర్చులు పోగా 30 వేల రూపాయలు మిగులు ఆదాయము లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్య ఘర్ ద్వారా సౌరఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తూ వారు వాడుకోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందవచ్చన్నారు. 
 
తదుపరి ఆర్.ఆర్.వుడ్ వర్క్స్ పేరుతో ఏర్పాటు చేసిన వుడ్ కార్వింగ్ వుడ్ డిజైనింగ్ వర్క్స్ డ్వాక్రా యూనిట్ను కలెక్టర్ పరిశీలించారు
 శ్రీరామ ఎస్ హెచ్ జి సభ్యురాలు అయిన మోకా ప్రేమలీల వారి భర్త గోవర్ధన్ రావు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమని, తమకు కార్పెంటర్ పనిలో అనుభవం ఉండడంతో బ్యాంక్ లింకేజీ ద్వారా 2 లక్షల రూపాయలు, పీఎంఈజీపి ద్వారా 10 లక్షలు వెరసి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో రెండు నెలలుగా యూనిట్ ఏర్పాటు చేసుకొని పనులు చేపట్టామని నెలకు ఖర్చులు ఈఎంఐలు పోగా 40 నుంచి 50 వేల రూపాయలు మిగులు ఆదాయం ఉంటుందన్నారు. కోడూరు నాగాయలంక మండలాల నుండి తమకు ఆర్డర్లు వస్తున్నాయనీ, తమ వద్ద ఇద్దరు ఉపాధి పొందుతున్నారన్నారు.
 
తదనంతరం కలెక్టర్ శ్రీ సాయి టైలరింగ్ పేరుతో నాగు ఎస్ హెచ్ జి సభ్యురాలు బొండాడ సుమ దేవి, వారి భర్త శివప్రసాద్ ఏర్పాటు చేసుకున్న శ్రీ సాయి టైలరింగ్ ఎంబ్రాయిడరీ డిజైన్ కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్స్ డ్వాక్రా యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు 4 నెలల కిందట బ్యాంకు లింకేజీ కింద 2 లక్షల రూపాయలు పీఎంఈజిపి కింద 12 లక్షల రూపాయలు వెరసి 14 లక్షల రూపాయలు మంజూరు అయిందని చుట్టుపక్కల నాలుగు మండలాల నుండి మంచిగా వ్యాపారం జరుగుతుందని 8 మంది వరకు కూలీలకు ఉపాధి లభించిందని, నెలకు 2 లక్షల రూపాయల రాబడి అందులో ఖర్చులన్నీ పోగా 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం లభిస్తుందన్నారు.
అనంతరం జై దుర్గ భవాని పేరుతో ఎస్ఎస్సి మహిళలు బీమా శేషకుమారి, తక్కెళ్ళ వేద లక్ష్మి నడుపుతున్న వివిధ రకాల పళ్ళ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు తమకు ఖర్చులన్నీ పోగా రోజుకు 4,500 ఆదాయం లభిస్తోందన్నారు.
 
తదుపరి నాగాయలంకలో శ్రీ సరస్వతి ఎస్ హెచ్ జి సభ్యురాలు మేడ నాగ బసవమ్మ ఏర్పాటు చేసిన కొల్హాపూర్ బెల్లం డ్వాక్రా యూనిట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్వయంగా కలెక్టర్ బెల్లం టీ ఆస్వాదించి తనతోపాటు వచ్చిన అధికారులు సిబ్బందికి అందరికీ బెల్లం టీ ఇప్పించి ఆ బిల్లు మొత్తం జిల్లా కలెక్టర్ చెల్లించారు. 
 
ఈ సందర్భంగా నాగ బసవమ్మ మాట్లాడుతూ తనకు బ్యాంకు లింకేజీ కింద ఒకటిన్నర లక్ష రూపాయలు, స్త్రీ నిధి కింద మరో ఒకటిన్నర లక్ష రూపాయలు వెరసి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం తో బెల్లం టీ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. తాము మహారాష్ట్ర నుండి ప్రతినెలా బెల్లం పొడి తెచ్చుకుంటున్నామన్నారు. రోజుకు 5000 రూపాయల ఆదాయం ఉంటుందని అందులో ఖర్చులు 3 వేల రూపాయలు పోను 2 వేల రూపాయల నికర ఆదాయం లభిస్తుందన్నారు. ఇంకా వ్యాపారం రుణాలు కావాలని కోరగా ఇలాగ వెంటనే స్పందిస్తూ పి ఎం ఎఫ్ ఎం ఈ కింద రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
 
నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలోఎస్ హెచ్ జి సభ్యురాలు బొమ్మిడి లతా లక్ష్మి, ఆమె భర్త నరసింహారావు ఏర్పాటుచేసిన పడవల తయారీ డ్వాక్రా యూనిట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
వారితో మాట్లాడి వారి ఆదాయ వివరాలను, మిగులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ముద్ర రుణాలు 10 లక్షల రూపాయలు, స్త్రీ నిధి కింద 75 వేల రూపాయలు మంజూరు అయిందన్నారు. సీజన్లో 5 లక్షల వరకు పని జరుగుతుందని, 25 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారన్నారు. నెలకు దాదాపు ఒక లక్ష రూపాయలు అన్ని ఖర్చులు పోను మిగులు ఆదాయం ఉంటుందన్నారు.ఇంకా రుణాలు ఇవ్వాలని వారు కోరగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ పీ ఎం ఈజిపి కింద మరో 20 లక్షల రూపాయలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. 
 
తదుపరి గుల్లలమోద గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ గ్రామంలో 300 ఎకరాలు వరద నీటితో ముంపుకు గురవుతోందని దాని నుండి రక్షణ పొందేందుకు ఎంపీ మంజూరు చేసిన 12 లక్షల రూపాయలతో కొంతవరకు రక్షణ గోడ పనులు జరిగాయని ఇంకను పంపింగ్ స్కీం పనులు నిదానంగా జరుగుతున్నాయని, త్వరగా పూర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి ఈఈ రాయన్నతో ఫోన్లో మాట్లాడుతూ వెంటనే వారంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
 
అలాగే మత్స్యకారులు పడవలు సముద్రంలో వేటకు వెళ్లడానికి మధ్యలో మెరకవేయడంతో చాలా ఇబ్బందిగా ఉందని దాన్ని తొలగించి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా అందుకు వారు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో తాజ్ మహల్ ఎస్ హెచ్ జి మహిళా సభ్యురాలు యన్ జ్యోతి కుమారి కరిష్మా ఫుడ్స్ పేరుతో పేరుతో ఏర్పాటు చేసుకున్న చెకోడీల తయారీ డ్వాక్రా యూనిట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్త రామచంద్రరావు మాట్లాడుతూ సీజన్లో రోజుకు 1500 ప్యాకెట్ల విక్రయంతో 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు.
 
తదుపరి మండల కేంద్రమైన చల్లపల్లిలో శ్రీ లలితా దేవి ఎస్ హెచ్ జి సభ్యురాలు ఆకుల నలిని ఏర్పాటు చేసుకున్న దుర్గా బోటిక్ లేడీస్ టైలరింగ్ యూనిట్లు దుకాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు బ్యాంకు లింకేజీ కింద 1.82 లక్షల రూపాయలు, ముద్ర రుణాల కింద 2 లక్షల రూపాయలు ప్రభుత్వ మంజూరు చేసిందన్నారు. తమకు నెలకు ఖర్చులు అన్నీ పోగా 50 వేల రూపాయల ఆదాయం లభిస్తుందన్నారు.
 
 
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, నాగాయలంక తహసిల్దారు ఆంజనేయ ప్రసాదు, డిపిఎంలు మధు, సుధాకర్, ఏపిఎం శ్రీనివాస్, సీసీ శ్రీలక్ష్మి, ఎఫ్డిఓ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
 
About Author

ssnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *