నిషేధిత భూముల జాబితా 22 ఏ లో ఉండే ఇళ్ల స్థలాలను ఎవరైనా సరే మార్చుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన అవనిగడ్డ తహసిల్దార్ కార్యాలయం సమావేశం మందిరంలో జీవో నంబర్ 30 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ దస్తావేజుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పాల్గొని 40 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా అవనిగడ్డలో సొంత స్థలం ఉండి కూడా 22 ఏ నిషేధిత భూమిగ ఉండడంతో హక్కులు లేక చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ముఖ్యంగా ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాను జిల్లాకు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఈ విషయం తన దృష్టికి తీసుకొని వచ్చారని వారి చొరవతో రెవెన్యూ యంత్రాంగం కృషితో లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు నిషేధిత భూమి జాబితా నుండి తొలగించి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతున్నామన్నారు. అందుకు కృషిచేసిన శాసనసభ్యులకు రెవెన్యూ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఇంకా ఎవరైనా సరే నిషేధిత భూముల జాబితాలో వారి ఇంటి స్థలాలు ఉండి ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, కలెక్టరేట్లో తాను ప్రతినెల రెండు లేదా మూడుసార్లు సమావేశాలు నిర్వహించి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ చిరకాల సమస్య పరిష్కరించడంలో జిల్లా కలెక్టర్ చూపిన చొరవ అభినందనీయమన్నారు. గత 40 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నప్పటికీ 22 ఏ నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి ఉండిందన్నారు. భూమి స్వాధీనంలో ఉన్న హక్కు లేక అప్పు పొందే అవకాశం లేదన్నారు. నేడు కలెక్టర్ నేతృత్వంలో తహసిల్దార్ కృషితో పంచాయతీ పరిధిలోని 40 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అనంతరం ఇళ్ల పట్టాల జారీకి కృషిచేసిన జిల్లా కలెక్టర్ ను శాసనసభ్యులు సన్మానించారు.
ఈ సందర్భంగా పదోన్నతి పై వెళుతున్న తహసిల్దార్ నాగమల్లేశ్వరరావును జిల్లా కలెక్టర్ తో పాటు శాసనసభ్యులు, రెవెన్యూ సిబ్బంది అందరూ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, తహసిల్దారు నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో మరియా దేవి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.