విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని, విద్యను మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని బోధించాలని, సంస్కారవంతమైన భారతీయులుగా తయారు చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
గురువారం ఉదయం భారత మాజీ ఉపరాష్ట్రపతి రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కృష్ణ తరంగ్, అంతర కళాశాల యువజనోత్సవాలు –2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగాల భర్తీలో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని, ఆ దిశగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రజల కోసం చేసే పరిపాలనలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉత్తర ప్రత్యుత్తరాలలో పరిపాలన భాషగా తెలుగును ఉపయోగించాలని ఆకాంక్షించారు.
మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదని చెబుతూ, తెలుగువారుగా అందరూ మాతృభాష పట్ల మొదట ఆసక్తి పెంచుకోవాలని, తర్వాతే దేశంలోని హిందీ వంటి ఇతర భాషలు, ఆంగ్ల భాషను నేర్చుకోవాలన్నారు.
అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, పరిమితికి మించి ఉపయోగిస్తూ బానిసలుగా మారి సమయాన్ని వృధా చేసుకోవద్దని, ఆ సమయాన్ని లక్ష్యసాధనకు నైపుణ్య అభివృద్ధి కోసం ఉపయోగించాలని విద్యార్థులకు హితువు పలికారు. చదువుతోపాటు పాఠ్యేతర కార్యకలాపాలు కళలు, క్రీడలకు సమయం కేటాయించాలని, అవి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యువత దేశ సంపదని పేర్కొంటూ యువతలో తగిన సమయంలో స్ఫూర్తిని నింపి మార్గనిర్దేశం చేస్తే దేశానికి గొప్ప సంపదగా తయారవుతారని పేర్కొన్నారు.
భారతదేశం త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయం, జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన విద్య సంస్థ అని పేర్కొంటూ విశ్వవిద్యాలయంలో కృష్ణ తరంగ్ అంతర కళాశాల యువజనోత్సవాలు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, పోటీ తత్వాన్ని ప్రోత్సహించటం అభినందనీయమన్నారు.
2014 నుంచి ప్రతి సంవత్సరం తాను యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తూ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకుడి నుంచి అంచలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ఎదిగిన క్రమం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడే తీరు ఎంతో హుందాతనంగా ఉంటుందని, అది నేటి రాజకీయవేత్తలు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాతృభాష తెలుగులోనే పాలనాపర ప్రత్యుత్తరాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతితో తనకు ఉన్న నాటి రాజకీయ అనుబంధాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.
అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన కృషి, జిల్లా చరిత్ర, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన ప్రొఫెసర్ రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, విశ్వవిద్యాలయం రెక్టర్ బసవేశ్వరరావు, ప్రోగ్రా కన్వీనర్ దిలీప్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్, పీవీ గజేంద్రరావు, సోడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

